పయ్యావులతో కేసీఆర్ ఏం మాట్లాడారు?... టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే!

  • పయ్యావుల కేశవ్ తో 15 నిమిషాలు మాట్లాడిన కేసీఆర్
  • వ్యక్తిగత కార్యదర్శితో పయ్యావులకు కబురంపిన కేసీఆర్
  • వారిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారంటూ టీడీపీలో చర్చ
మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఒక సన్నివేశం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాహ వేడుకలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పాల్గొన్న సంగతి తెలిసిందే. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం కేసీఆర్ హెలిప్యాడ్‌ కు బయల్దేరారు. ఇంతలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఎదురుపడి నమస్కారం చేశారు. ప్రతి నమస్కారం చేసిన కేసీఆర్ హెలికాప్టర్ వద్దకు కదిలారు.

అంతలో కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి పయ్యావుల వద్దకెళ్లి సీఎం పిలుస్తున్నట్టు తెలిపారు. దీంతో ఆయన కేసీఆర్ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో సుమారు పావుగంటసేపు వారిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో సీఎం వ్యక్తిగత సిబ్బందిని కూడా అక్కడికి రానివ్వకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో వారిద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకున్నారా? అని టీడీపీలో చర్చ రేగినట్టు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ టీడీపీలో ఉండగా అనంతపురం ఇన్‌ చార్జి మంత్రిగా మూడేళ్లపాటు పనిచేశారు. ఆ సమయంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ్‌ కూడా పని చేశారు. ఆ సమయంలో ఏర్పడిన సాన్నిహిత్యంతోనే నేడు వారు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. 
Go Back to Shorts
kcr
payyavula
Telugudesam
chandrababu
paritala marriage

More Telugu News